Tuesday, 9 February 2021

నా అంతటి నటి ఈ భూమి మీద లేదు.. ఇది నా సవాల్: కంగనా రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు గర్వం, పొగరు ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. ఇలా అనడానికి కారణం ఆమె ప్రవర్తన. ఏ విషయంలోనైనా ఆమె వెనకడుగు వేయరు. ఈ క్రమంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఆ మధ్య తన కార్యాలయం కూల్చివేత అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఢీకొట్టారు. ఇది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. ఆ తరవాత బాలీవుడ్ నటీమణులతో విభేదాలు.. రైతుల ఉద్యమం విషయంలో బీజేపీకి వత్తాసు.. ఇలా ఒకటి రెండు కాదు ఆమె వేలు పెట్టని వివాదం లేదు. తాజాగా మరో వివాదానికి తెరలేపారు ‘క్వీన్’ . ఈ భూగోళంలో ప్రస్తుతం తనను మించిన నటీమణి లేదంటూ బీరాలు పోతున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ట్వీట్ చేశారు. తాను చేస్తోన్న రెండు సినిమాల్లోని స్టిల్స్‌ను ట్వీట్ చేసిన కంగనా.. వాటి మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ తనలో భయంకరమైన నటి ఉందని వెల్లడించారు. ‘‘ఒక నటిగా నేను చూపించే ఈ స్థాయిని ప్రస్తుతం ఈ భూగోళంలో మరే నటి చూపించలేదు. మెరిల్ స్ట్రీప్ (ప్రముఖ హాలీవుడ్ నటి) మాదిరిగా వైవిధ్యమైన పాత్రలు చేసే రా టాలెంట్ నాలో ఉంది. అలాగే, గాల్ గాడోట్ (ప్రముఖ ఇజ్రాయిల్ నటి) మాదిరిగా యాక్షన్ చేయగలను, గ్లామర్‌గా కనిపించగలను’’ అని కంగనా రనౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, ప్రస్తుతం భూమిపై ఉన్న ఇద్దరు ప్రముఖ నటీమణుల లక్షణాలు ఈమెలో ఉన్నాయని చెబుతున్నారు కంగనా. అంతటితో ఆగలేదు.. ‘‘నా కన్న గొప్పగా, అద్భుతంగా నటించే నటి ఈ భూమి మీద ఉందని నాకు చూపిస్తే నేను డిబేట్‌కు సిద్ధం. ఒక వేళ మీరు నిరూపిస్తే నేను నా అహంకారాన్ని వదులు కుంటున్నానని మాటిస్తున్నాను. అప్పటి వరకు ‘తలైవి’, ‘ధాకడ్’ గర్వాన్ని మీకు అందించగలను’’ అని కంగనా ట్వీట్ చేశారు. మొత్తం మీద తన అహంకారాన్ని దించడానికి బహిరంగ సవాల్ విసిరారు. కానీ, ఎవరిప్పుడు అంత ఖాళీగా ఉన్నారు. అందుకే, కంగనాకు సవాల్ విసరడం మాని ట్విట్టర్‌లో ఆమెను తిట్టిపోస్తున్నారు. మరీ ఇంత అహంకారం పనికి రాదని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం కంగనా తన తదుపరి చిత్రం ‘ధాకడ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆమె ఇప్పటికే ‘తలైవి’ సినిమాను పూర్తిచేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YXHcGr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...